ఒక్కసారి మా వాళ్లు తిరగబడితే పరిస్థితేంటో తెలుసుకోండి: చంద్రబాబు

కర్నూలు: చంద్రబాబు కర్నూలులో రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యాంగులకు మొదటి నుంచి అండగా ఉన్నది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 640 దాడులు జరిగాయన్నారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తుంటే సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారన్నారు. దాడులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మంత్రులు బూతుల మంత్రులుగా తయారయ్యారని ఫైర్ అయ్యారు. 'ఒక్కసారి మా వాళ్లు తిరగబడితే మీ పరిస్థితేంటో తెలుసుకోండి' అంటూ హెచ్చరించారు. ఎన్నికల ముందు వైఎస్‌ వివేకాను ఇంట్లోనే హత్య చేసి.. సాధారణ మృతిగా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారన్నారు. లా అండ్‌ ఆర్డర్‌తో ఆడుకుంటే మీ పతనం తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.